90 ఓట్లున్న అస్సాం పోలింగ్ బూత్‌లో పోలైన 181 ఓట్లు: ఆరుగురు అధికారులపై వేటు

Contacts:

National

oi-Rajashekhar Garrepally

|

Published: Monday, April 5, 2021, 22:57 [IST]

గౌహతి: అస్సాంలో ఆరుగురు పోలింగ్ అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దిమా హసవో జిల్లాలోని ఓ బూత్‌లో 90 ఓట్లు ఉండగా.. 181 ఓట్లు పోలవడమే ఇందుకు కారణం. ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్ లో భాగంగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. హఫ్లంగ్ నియోజకవర్గంలోని ఈ బూత్ ఉంది.

2016లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బీర్ భద్ర హగ్జర్ గెలుపొందారు. ఇక్కడ 74 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్ల కంటే ఎక్కువ ఓట్లు పోలైన నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

90 Voters, 181 Votes In Assam Polling Booth. 6 Officials Suspended

రిజిస్టర్ అయిన ఓటర్లకే ఓటు వేసేందుకు అనుమతించామని, అయితే, ప్రధాన పోలింగ్ స్టేషన్లో లేనివారిని కూడా అనుమతించామని ప్రిసైడింగ్, తొలి పోలింగ్ అధికారి అంగీకరించారని ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో సెక్టార్ ఆఫీసర్ సీఖోసిమ్ ళంగమ్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రహ్లాద్ సీహెచ్ రాయ్, తొలి పోలింగ్ అధికారి పరమేశ్వర్ చరంగ్సా, రెండో పోలింగ్ ఆఫీసర్ స్వరాజ్ కాంతి దాస్, మూడో పోలింగ్ అధికారి లాల్జమ్లో థీక్ లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రతబారి స్థానం తర్వాత ఎన్నికల సంఘం రీ పోలింగ్ నిర్వహించే స్థానం ఇది కావడం గమనార్హం. ఓ బీజేపీ నేత వాహనంలో ఈవీఎం లభించడంతో నలుగురు అధికారులను ఈసీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, అస్సాంలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 27న తొలి దశ ఎన్నికలు జరుగ్గా, రెండో దశ గతవారం జరిగింది. మంగళవారం చివరిదైన మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం అధికారం ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తామని చెప్పుకుంటోంది.

Posted in: Telugu News Posted by: admin On: