హీటెక్కిన టెంపుల్ టౌన్: బరిలో నారా లోకేష్..అక్కడే మకాం: సేవ్ తిరుపతి పేరుతో: రేపు పవన్

Contacts:

Tirupati

oi-Chandrasekhar Rao

|

Published: Friday, April 2, 2021, 7:55 [IST]

తిరుపతి: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నకి వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ప్రచార బరిలో దిగబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఇంకొన్ని గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ తరఫున మిత్రపక్ష జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాదయాత్ర నిర్వహించనున్నారు.

ఈ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేస్తోన్న కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కోసం నారా లోకేష్ ఈ సాయంత్రం తిరుపతికి రానున్నారు. పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలను కలుసుకుంటారు. ఇప్పటిదాకా చేపట్టిన ప్రచార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఏఏ నియోజకవర్గాల్లో ఎప్పుడు పర్యటించాలనే షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. దీనికి సంబంధించినంత వరకూ చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు ఇప్పటికే ఓ రూట్ మ్యాప్‌ను రెడీ చేశారు. అందులో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. శనివారం నుంచి నారా లోకేష్ తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తారు.

Tirupati Bypoll: TDP leader Nara Lokesh to begin campaign from today

తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా www.savetirupati.com పేరుతో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగితే.. తమకు తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేసింది. దీనికి అనుబంధంగా 80999 75975 నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడంలో వైసీపీ నేతలు విఫలం అయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికే ఈ ఏర్పాటు చేశామని చెప్పారు.

బీజేపీ అభ్యర్థిని, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రత్నప్రభకు మద్దతుగా ఆ పార్టీ మిత్రపక్షం జనసేన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రచార బరిలో దిగనున్నారు. శనివారం ఆయన తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కల్యాణ్ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శంకరంబాడి సర్కిల్ సమీపంలోని అన్నపూర్ణ టెంపుల్ వద్ద బహిరంగ సభ ఉంటుంది.

Posted in: Telugu News Posted by: admin On: