సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి షాకింగ్ కామెంట్స్…

Contacts:

Telangana

oi-Srinivas Mittapalli

|

Published: Friday, April 2, 2021, 12:08 [IST]

పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మళ్లీ నోరు జారారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే విమర్శలు గుప్పించారు.కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్నా… పట్టించుకోని పుణ్యుడు,పుణ్యాత్ముడు నరేంద్ర మోదీ,కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పరకాల నియోజకవర్గంలోని కంఠాత్మకూరు పర్యటనలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చల్లా ధర్మారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను గమనిస్తే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పొరపాటున కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో మోదీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. ‘అసలు నేను ఆయన్ను అడుగుతున్నా… ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే.. వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి… రైతులు బోరున ఏడుస్తున్నా… వారిని పిలిచి మాట్లాడకపోవడం మంచి పద్దతి కాదు.’ అని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

trs mla challa dharma reddy shocking comments on cm kcr

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్,టిక్రీ,సింఘు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర విధానాలను నిరసిస్తూ గతంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొన్నది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్రం చట్టం చేశాక రాష్ట్రాలు అమలుచేయక తప్పదంటూ వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఈ చట్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అవసరమైతే దేశంలోని విపక్ష పార్టీలన్నింటిని ఏకం చేసి కేంద్రంపై యుద్దం చేస్తానన్నారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు.

తాజాగా చల్లా ధర్మారెడ్డి కాకతాళీయంగా చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేసేందుకు అవకాశమిచ్చినట్లయింది. కాగా,ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్రం కొనసాగించినా…కొనసాగించకపోయినా గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని,కనీస మద్దతు ధర ఇస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొద్దిరోజుల క్రితమే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లతో ఉద్యోగాల్లోకి వస్తున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ అధికారులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వారికి అసలు పని చేయడమే రాదని… వారి వల్లే రాష్ట్రం నాశనమైందని అన్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజాస్వామిక సంఘాలు,బహుజన సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఎమ్మెల్యే చల్లా క్షమాపణలు చెప్పక తప్పలేదు.

Posted in: Telugu News Posted by: admin On: