రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం… తలైవాకు మోదీ శుభాకాంక్షలు.. ఎన్నికల వేళ వ్యూహాత్మకమేనా?

Contacts:

National

oi-Srinivas Mittapalli

|

Published: Thursday, April 1, 2021, 11:33 [IST]

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో గొప్ప నటుల్లో ఒకరైన రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. నటుడిగా,నిర్మాతగా,స్క్రీన్ రైటర్‌గా ఆయన సేవలు స్పూర్తిదాయకమని కొనియాడారు.

51వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రజనీకాంత్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తరాల తరబడి ప్రాచుర్యం… విభిన్నమైన పాత్రలతో రంజింపజేసి,మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి రజనీకాంత్ గారు. తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’ అని మోదీ పేర్కొన్నారు.

Rajinikanth conferred with 51st Dadasaheb Phalke award

తనదైన నటనతో,స్టైల్‌తో ఇండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించి కేంద్రం ఆయనకు సముచిత గౌరవం కల్పించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ అవార్డును ప్రకటించడంపై చర్చ జరుగుతోంది.

ఇప్పటికే వెలువడిన పలు సర్వేల్లో తమిళనాట ఈసారి డీఎంకెదే జయకేతనం అని వెల్లడైన సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమికి ఈసారి భారీగా సీట్లు తగ్గుతాయని… ఓటమి తప్పదన్న అంచనాలు వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో రజనీకాంత్‌కు కేంద్రం అవార్డును ప్రకటించడం వ్యూహాత్మకమేనా అన్న సందేహాలకు తావిచ్చింది. తలైవా అభిమానులను తమవైపుకు తిప్పుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ అవార్డు ప్రకటించారా అన్న చర్చ జరుగుతోంది.

ఏదేమైనా తలైవాకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడంతో సర్వత్రా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాది నుంచి ఇంతకుముందు ఈ పురస్కారం అందుకున్నవారిలో శివాజీ గణేషన్‌(తమిళం), రాజ్‌కుమార్‌(కన్నడ), బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు),గోపాలకృష్ణన్‌(మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్‌(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్‌(తెలుగు) ఉన్నారు.

Posted in: Telugu News Posted by: admin On: