ఏప్రిల్ 1 ఫూల్స్ డే చరిత్ర: ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?

Contacts:

International

-BBC Telugu

By BBC News తెలుగు

|

Updated: Thursday, April 1, 2021, 15:40 [IST]

క్యాలెండర్

ఏప్రిల్ 1 రాగానే చాలామంది తమ స్నేహితులను, బంధువులను ఆటపట్టిస్తుంటారు. ఇలా ఎదుటివారిని భయపెట్టడం, ఆటపట్టించటం, అల్లరి చేయటం వ్యక్తులకే పరిమితం కాదు. కొన్ని సంస్థలు కూడా ఇలాగే చేస్తుంటాయి. కానీ ఈ సంప్రదాయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసా?

”కనీసం 19వ శతాబ్దం నుంచి ఇంగ్లండ్‌లో ‘ఫూల్స్ డే’ను జరుపుకుంటున్నారు. ఆరోజు సాధారణంగా పిల్లలనే ఎక్కువగా ఆటపట్టిస్తుంటారు” అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్‌కు చెందిన చరిత్రకారులు ఆండ్రియా లివ్సీ అన్నారు.

కానీ ఈ పండుగ ఎక్కడి నుంచి వచ్చిందో చాలామందికి తెలీదని ఆమె అన్నారు.

”ఏప్రిల్ ఫూల్స్ డే గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు. ఆ కథలన్నీ సరదాగా ఉంటాయి” అని ఆండ్రియా అన్నారు.

సో.. ‘ఫూల్స్ డే’ వెనుక వినిపిస్తున్న మూడు కథలను విందాం పదండి..

మొదటి కథ – కవిత్వం

”14వ శతాబ్దంలో ఇంగ్లీష్ కవి జాఫ్రీ ఛాసర్ రాసిన ‘గుంటనక్క-కోడిపుంజు’ కవితతో ఫూల్స్ డే మొదలైందని కొందరి వాదన. ఈ కథలో గుంటనక్క కోడిని భయపెట్టి, ఆటపట్టిస్తుంది. అప్పటి నుంచి ఏప్రిల్ 1న అందరూ తమవారిని ఆటపట్టించడం ఒక సంప్రదాయంగా మారింది. కానీ అందులో ఛాసర్.. ‘ఏప్రిల్ 1’ అని ఎక్కడా ప్రస్తావించలేదు. ‘మార్చి మొదలయ్యాక 32 రోజులకు’ అని ఛాసర్ రాశాడు. మార్చి మొదటి నుంచి 32రోజులు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు వస్తుందిగా..’’ అని ఆండ్రియా అన్నారు.

కానీ పాఠకులను ఆటపట్టించడానికే ఇలాంటి అయోమయమైన వాక్యాలను ఛాసర్ వాడాడని కొందరు చెబుతున్నారు.

రెండో కథ – క్యాలెండర్స్

క్యాలెండర్‌ ప్రకారమే ఈ సంప్రదాయం మొదలైందని కొందరు విశ్వసిస్తున్నారు. రోమన్ కాలంలో కొనసాగింపు పండుగలు ఉండేవి. సాధారణంగా నూతన సంవత్సరానికి కొనసాగింపుగా కొన్ని పండుగలు జరుపుకునేవారు. ఈ పండుగలు చాలా సరదాగా ఉండేవి.

”ఈ పండుగలపుడు పనివాళ్లు యజమానులను, పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టించొచ్చు..” అని ఆండ్రియా అన్నారు.

మార్చి నెలలో వసంతకాలం వస్తుంది. ఈ కాలాన్ని నూతన సంవత్సరాదిగా అప్పట్లో భావించేవాళ్లు. క్యాలెండర్ ఆధారం చేసుకుని, మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

మార్చి కాకుండా, ఇప్పటిలాగే జనవరి నెలను కొందరు.. న్యూ ఇయర్‌గా జరుపుకునేవారు. అలాంటివారిని ఫూల్స్‌గా పరిగణిస్తూ, వారిపై జోకులు వేసుకునేవారు.

మూడో కథ – యూరప్‌లో చేపల వేట

”ఏప్రిల్ 1 గురించి నిర్దిష్టమైన ఆధారాలను ఫ్రాన్స్, హాలండ్‌లోని 16వ శతాబ్దం అందిస్తోంది. అందుకే, ఈ పండుగ ఉత్తర ఐరోపా సంప్రదాయమని, అక్కడినుంచి బ్రిటన్‌కు వచ్చిందని భావిస్తారు” అని ఆండ్రియా అన్నారు.

యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజును ‘ఏప్రిల్ ఫిష్ డే’గా పిలుస్తారు. ఈ సమయంలో ఫ్రాన్స్‌లోని కాలువలు, నదుల్లో చేపలు ఎక్కువగా దొరుకుతాయని, ఆ సమయంలో చేపలు పట్టడం సులువని భావిస్తారు – ‘పిచ్చి చేపలు..’

అలా మనుషులను వెర్రి చేపలతో పోలుస్తూ, ఆటపట్టిస్తూ.. ఏప్రిల్ 1ను ఫూల్స్ డేగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.

”ఫ్రాన్స్‌లో ఇప్పటికీ ఈ ఏప్రిల్ 1న ఈ చేపలకు ప్రాధాన్యం ఉంది. ఆరోజున అందర్నీ ఆటపట్టించడానికి పేపర్ చేపలను తయారుచేసి, వాటిని చప్పుడు కాకుండా ఇతరుల వీపుపై అతికిస్తారు. లేదా ‘చాకొలేట్ ఫిష్’లను బహుమతిగా ఇస్తారు” అని ఆండ్రియా వివరించారు.

కానీ అసలు ఏప్రిల్ 1 ఎప్పుడు మొదలైందంటే కచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ఏప్రిల్ 1న జోకులు వేయడం, అందర్నీ ఆటపట్టించడం అన్నది చాలా కాలంగా వస్తోంది.

జాగ్రత్త.. మిమ్మల్ని ఫూల్ చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నట్లున్నారు!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in: Telugu News Posted by: admin On: